గీతను నేర్చుకొంటూ, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నా.
కరోనా సమయంలో నాకు ఒక వరంలా దొరికింది, ఈ గీతాపరివార్ యొక్క భగవద్గీతా చార్ధామ్ యాత్ర.
మా అమ్మగారిని మాధ్యమంగా చేసుకొని కృష్ణ పరమాత్మ నాకు ఈ గీతాపరివార్ లింకును విమలారెడ్డి గారి ద్వారా పంపించారు. నేను ఈ సంస్కృత శ్లోకాలను పఠించలేను అనే భయముతో మొదట మా పాప(శిశిర) ని గీతాపరివార్ లో చేర్పించాను. మా శిశిర గురువుగారు అయినా వల్లీగారు గీతను చెప్పే విధానము చూసి గీతను ఇంత సులువుగా సంగీతంలా నేర్చుకోవచ్చా అని, నేను కూడా 2021 మార్చి లో చేరడం జరిగింది. గీతా పరివార్ లో నా చార్ధామ్ యాత్రను చక్కటి ప్రశిక్షకులు ఆధ్వర్యంలో పూర్తి చేసుకున్నాను.
ఒక ఆనందోత్సవంలో తేజస్విని దీదీ సేవలోకి రమ్మని చెప్పే విధానం నచ్చి నేను టెక్నికల్ అసిస్టెంట్ గా చేరాను. ట్రైనర్ గా అయితే పరీక్ష ఇవ్వాలి, తెర ముందు కనిపించాలి అని ఎన్నో భయాలు ఉండేవి. కాని గీతాపరివార్ నాకు కొంతమంది ఆత్మబంధువులను ఇచ్చింది. అందులో ఒకరు హారతిదుంపలగారు... ఆవిడ ప్రోత్సాహంతో నేను ట్రైనర్ గా సేవను అందించడానికి ముందుకు వచ్చాను. అలా నాలో ఉన్న స్టేజ్ ఫియర్ ను గీతా పరివార్ పటాపంచలు చేసింది.
మొట్టమొదటిసారి techగా ఆనందోత్సవంలో నేను ఏమీ మాట్లాడలేదు.... అంతా మీరే మాట్లాడండి అని ట్రైనర్ గారికి చెప్పాను. కానీ ఇప్పుడు నన్ను ఎంతోమంది చీఫ్ గెస్టు గా వారి ఆనందోత్సవాలకు ఆహ్వానిస్తున్నారు. నా యొక్క మాటలు వారికి ఎంతో స్ఫూర్తిని ఇస్తున్నాయి అని వారు మళ్ళీ తదుపరి ఆనందోత్సవంలో...సేవలోకి వచ్చి చెబుతున్నారు. అప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యం మరియు ఆనందాన్ని కలిగిస్తోంది.
గీతా పరివార్ వారు మనకు ఒక్క భగవద్గీతనే నేర్పించడం లేదు... మనలో ఉన్న భయాలను, బిడియాలను, వత్తిళ్ళను, తొందరపాట్లను అన్నింటిని పోగొట్టి మనలో ఉన్న ఆత్మవిశ్వాసమును, సృజనాత్మకతను మరియు సహనమును బయటకు తెస్తున్నారు. ఎలా అయితే శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్రంలో గాండీవము చేజార్చిన అర్జునుని వెన్ను తట్టి లేపాడో అదేవిధంగా నన్ను గీతాపరివార్ వారు ఈ విధముగా తీర్చిదిద్దారు.
అలానే నన్ను గురువుగారైన శర్మగారు తెలుగు వివేచన ట్రాన్స్లేషన్ టీం లో చేర్చి ఇంకొక అవకాశం ఇచ్చారు. మొదటి వివేచన రాసేటప్పుడు నేను ఎంతో భయపడ్డాను, నేను రాయగలనా అని చాలా సంశయించాను, నాకు మొదటి వివేచన రాయడానికి ఒక రోజు పట్టింది కానీ తరువాత నాలుగు గంటల్లో ఆ వివేచన్ని ఎంతో ఆస్వాదిస్తూ రాసేదాన్ని. అలానే, గీతా పరివార్ వారు వ్యాకరణ తరగతులకు యాంకరింగ్ చేసే సేవను నాకు అందించారు.
ఇలా గీతా పరివార లో చార్ధామ్ యాత్ర... అని చేరిన నేను భగవద్గీతను నేర్చుకోవడమే కాకుండా నాలుగు లెవెల్స్ లోను ప్రశిక్షకురాలిగా 18 అధ్యాయాలు నేర్పించే అవకాశాన్ని అందజేశారు. అలానే ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దారు.
ఇంతటి చక్కటి అవకాశాలను ఇస్తూ చక్కని ఉచ్చారణతో గీతను అందించిన గీతా పరివార్ వారందరికీ నా శతకోటి వందనాలు. అలానే ఇంతటి మహాయజ్ఞాన్ని మొదలు పెట్టిన పూజ్య శ్రీ గోవింద్ దేవ్ గిరిజీ మహారాజ్ గారికి నా మనఃపూర్వక పాదాభివందనాలు
- M.V. Shanti Varma, Hyderabad
